శ్రీ శ్యాంకుమార్ వూర గారి తో
ఫోటోస్పాట్ : గత 35 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉంటూ, ఫోటోగ్రఫీకే తన జీవితాన్ని అంకితం చేసిన కృషీవలుడు. మొదటినుండి ఇప్పటివరకు ఈ ఇండస్ట్రీలో టెక్నాలజీ పరంగా వస్తున్నమార్పులను, కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి శ్యాంకుమార్ వూర.
ఫోటోస్పాట్ : గత 35 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉంటూ, ఫోటోగ్రఫీకే తన జీవితాన్ని అంకితం చేసిన కృషీవలుడు. మొదటినుండి ఇప్పటివరకు ఈ ఇండస్ట్రీలో టెక్నాలజీ పరంగా వస్తున్నమార్పులను, కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి శ్యాంకుమార్ వూర. ఈ పేరుచెప్పగానే మనకు నిలువెత్తు కదిలే కెమెరా గుర్తుకువస్తుంది, ఫోటోగ్రాఫర్లకు పెద్దన్నగా ఉంటూ, ఫోటోగ్రాఫర్లకు ఎలాంటి ఆపదవచ్చి తనను ఆశ్రయించగానే నేనున్నానంటూ ఫొటోగ్రాఫర్ల తరుఫున సమస్యకు ఎదురొడ్డి నిలిచేవారు, సమస్యలపై పోరాడే అవిశ్రాంత శ్రామికుడు. ఆయన్ని ఫోటోస్పాట్ పలకరించగా తన మధురానుభూతులను, అనుభవాలను, గతస్మృతులను ఫోటోస్పాట్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఫోటోస్పాట్ ప్రేక్షకుల కోసం అయన మాటల్లోనే
బాల్యం
1980 తోలి నాళ్లలో ఏలూరులో 8 వ తరగతి చదువుతున్నపుడు మా స్కూల్ లో ఉదయం పూట స్కూల్ తరగతులు మధ్యాహ్నం నుండి కాలేజీ తరగతులు చెప్పేవారు, స్కూల్ అయిపోగానే ఇంటికెళ్ళి భోజనం చేసి మా తాత (ఉప్పల సత్యనారాయణ (ఉప్పలసత్యం]) గారి రంగూన్ ఫోటోస్టూడియోకెళ్ళి కూర్చోవడం జరిగేది, అప్పట్లో ఆయన పేరున్న ఫోటోగ్రాఫర్, రంగూన్ నుండి ఎక్విప్మెంట్ తెప్పించి స్టూడియో నడిపించేవాడు. ఫోటోలు ఎలా తీస్తున్నారు, ఆ డార్క్ రూమ్లో ఏముంటుంది ఇలాంటివన్ని నన్ను ఫోటోగ్రఫీ పట్ల ఆకర్షితుడిని చేసాయి, అప్పుడప్పుడు మా బాబాయి వూర సూర్యప్రకాశరావు గారితో శుభకార్యాలకు ఫోటోలు తీయడానికి వెళ్తుంటే వెనకాల సైకిల్ మీద కూర్చొని వెళ్ళేవాడిని, దూరం నుండి ఎలా తీస్తున్నారో గమనించేవాడిని, ఎప్పుడైనా కెమెరాని తాకినప్పుడు మొట్టికాయలు పడేవి,చిన్న పిల్లాడివి నీకేందుకు అని.
ఫోటోగ్రఫీ తొలినాళ్ళలో
మా గురువు గారు కోటేశ్వరరావు (తిమ్మాపూర్) గారి నుండి ఫోటోగ్రఫీ లో మెళకువలు నేర్చుకుని ఫోటోలు తీసేవాడిని, 1984లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామోదయ పథకం క్రింద ఫోటోస్టూడియో పెట్టుకోవడానికి ప్రభుత్వం నుండి 25,000 వేల రూపాయల లోన్ సహాయంతో మా అన్నగారు నేను కలిసి రాజ్ ఫోటో స్టూడియో నెలకొల్పడం జరిగింది. పెళ్ళికి ఫోటోలు తీయడానికి వెళ్తే విడిది ఏర్పాటు చేసి మర్యాదగా చూసుకునేవారు. కాని ఇప్పుడు అలాంటిదేం లేదు.. వచ్చామా... తీసామా వెళ్ళామా? భాదేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఫోటోగ్రాఫర్ కి విలువలేకుండా పోతోంది! ఐటి శాఖ ఆధ్వర్యంలో జిల్లా పౌరసంబంధాల శాఖలో కెమెరామెన్గా పనిచేసేవాడిని, అంటే ప్రభుత్వ కార్యక్రమాలు, పదవీవిరమణ, ప్రారంభోత్సవాలు వంటి వాటికి ఫోటోలు తీయడం, అప్పట్లో వరదలు వచ్చి ఆంధ్రప్రాంతం మొత్తం అతలాకుతలంఅయ్యింది, అప్పుడు వరదల ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన ముఖ్య మంత్రుల, మంత్రుల, ఫోటోలు తీయడం వాటికి ప్రభుత్వం వారి పత్రిక ప్రకటనలకు ఇవ్వడం చేశావాడిని, రాజకీయనాయకుల మీటింగులు, పరిచయాలు జరిగాయి.
బాల్యం
అసోసియేషన్ వైపుగా అడుగులు
అప్పట్లో భారత ప్రభుత్వ సర్వీస్ టాక్స్ చట్టం చేసింది. స్టూడియోలు ఉన్నవారు అమ్మే ప్రతి ఫోటో మీద 4% టాక్స్ ప్రభుత్వానికి కట్టాలి ఇది ఆ చట్టం సారాంశం, అంటే సినిమా స్టూడియోలకి, ఫ్యాషన్ స్టూడియోలకి, మామూలు ఫోటోస్టూడియోకి ఒకే రకమైన టాక్స్. దీనికి వ్యతిరేఖంగా జిల్లా మీటింగ్లు పెట్టడం, అన్ని జిల్లాల ఫోటోగ్రాఫర్లందరినీ ఒక దగ్గరికి చేర్చి AP ఫోటోగ్రాఫర్స్ సర్వీస్ టాక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఒక పెద్ద ఉద్యమమే చేసాము. ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, కనపడిన ప్రతి ప్రజా ప్రతినిధికి మెమోరాండంలు సమర్పించడం చేసాము, నేను గర్వంగా చెప్పుకునేది ఏమిటంటే, అన్ని జిల్లాల నుండి దాదాపు 38 మంది కలిసి డిల్లీ వెళ్లి దాదాపు 15 రోజులు అక్కడే వుండి పార్లమెంట్ ఆవరణలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలలో 542 మంది MP లకు ఈ అన్యాయంపై వినతిపత్రం ఇచ్చాం. ఇటువంటి పని దేశవ్యాప్తంగా ఏ ఒక్క అసోసియేషన్ కూడా చేయలేదు. అప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో అప్పటి శ్రీకాకుళం MP ఎర్రంనాయుడు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు, అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తరువాత ఆ చట్టాన్ని సవరణ చేసి 4 లక్షల వార్షిక ఆదాయం కన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు. ఒక్క ఫోటో స్టూడియోలె కాకుండా దాదాపు 72 శాఖలు ఈ చట్టం నుండి విముక్తి పొందాయి.
అసోసియేషన్ బాధ్యతలు
ఈ విజయం నాలో ధైర్యాన్ని నిపింది, డిల్లీలో పడిన కష్టాలన్నీ మరిచిపోయేలా చేసింది, తరువాత ఏలూరు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా కమిటీ సెక్రటరీగా, AP స్టేట్ అసోసియేషన్ సెక్రటరీగా పలు కీలక భాధ్యతలు నిర్వహించాను. మొట్ట మొదటి సారిగా మంచి ఫ్యాకల్టీలతో పెద్ద పెద్ద వర్క్ షాప్స్ని 70కి పైగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పేరు పొందిన ఫ్యాకల్టీ కాస్త వారి వారి వాణిజ్య వ్యాపార అవసరాలను కాస్త పక్కన పెట్టి వాలంటీర్ గా ముందుకొచ్చి తోటి ఫోటోగ్రాఫర్స్కి విజ్ఞానం పంచడం చేస్తే చాలా బాగుంటుంది. గడిచిన 7,8 సంవత్సరాలలో చాలామంది ఈ వర్క్ షాప్స్కి హాజరై అభివృద్ధి పథంలో
వెళ్తున్నారు.
కొత్తతరం ఫోటోగ్రాఫర్లకు ఇచ్చే సలహాలు
ఇంట్లో ఉన్న అమ్మకాని, భార్యకాని తను వండే వంటని ఎలా ఉందో అని కాస్త చేతిలో వేసుకొని రుచి చూస్తుంది, అలాంటిది ఒక ఫోటోగ్రాఫర్ కష్టపడి తీసిన ఫోటోలని చూడకుండా డిజైనర్ కి ఇవ్వడం ఫిల్టర్స్ వేసి ఫొటోస్ ఎడిట్ చేసి ఆల్బమ్ ప్రింటింగ్కి ఇవ్వడం, కస్టమర్కి నేరుగా ఆల్బమ్ తీసుకోమని ఫోన్ నంబర్ ఇవ్వడం ఇలా ఫోటోగ్రఫీకి విలువలేకుండా చేస్తున్నారు, పనితో పాటు విలువలు కుడా అవసరం, రానున్న తరాలవారికి ఫోటోగ్రఫీ అంటే చులకన భావం లేకుండా చూడాలి. ఆదర్శంగా నిలవాలి.
అసోసియేషన్ల గురించి
ఈ రోజుల్లో అసోసియేషన్లకి ఎవరూ గౌరవం ఇవ్వడం లేదు, ఎవరిఇష్టం వచ్చినట్లు వారు ధరలు పెట్టి ఈ ఫోటోగ్రఫీ వృత్తికి ద్రోహం చేస్తున్నారు, అసోసియేషన్లలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి, ఒక్కో అసోసియేషన్లో రెండేసి గ్రూపులు మూడేసి గ్రూపులు కడుతున్నారు. స్వీయ రాజకీయ లాభం కోసం గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. నిజాయితీగా కష్టపడి పనిచేసేవారికి చివరకు నిరాశే మిగులుతుంది, వారందరూ అవి మానుకున్ననాడే ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. లేకపోతే ఈ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది.”విన్నారు కదా ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ రంగంలో శ్యాంకుమార్ గారి ప్రయాణం. ఈ మధ్య ముఖపుస్తకం(facebook) వంటి సాంఘిక మాధ్యమంలో ఉంటూ ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ అప్డేట్స్ మరియు సమాజంలో ఫోటోగ్రఫీ రంగంలో జరుగుతున్న మంచిచెడులను ఎప్పటికప్పుడు మనతో పంచుకుంటూ ఉంటున్నటువంటి శ్యాంకుమార్ గారిని ఫోటోస్పాట్ గౌరవిస్తోంది "ముఖపుస్తక మహారాజు" అనే పేరుతో.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?