శ్రీ చక్కా రాంబాబు గారితో

ఫోటో స్పాట్: ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గానూ, తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గానూ వుంటూ ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషిచేస్తున్నారు.

Feb 10, 2023 - 20:21
Feb 11, 2023 - 17:02
 0  105
శ్రీ చక్కా రాంబాబు గారితో

ఫోటో స్పాట్:  ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గానూ, తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గానూ వుంటూ ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి అహర్నిశలు  కృషిచేస్తున్నారు. శ్రీ చక్కా రాంబాబు గారు 120 సంవత్సరాల ఫొటోగ్రఫీ నాలుగవతరం ఫొటోగ్రాఫర్గా కొనసాగుతున్నారు.ఫొటోగ్రఫీకి సంబంధించిన అన్ని రంగాలలో తన నైపుణ్యతను ప్రదర్శించి పేరు ప్రఖ్యాతలు పొందారు. 1986లో ఒకే ఫిల్మ్, 35 ఎం.ఎం. కెమెరాని ఉపయోగించి ఒకే ఫిల్మ్ పై ఒకే మనిషిని వివిధ భంగిమలలో చిత్రీకరించడం మళ్లీ ఎక్స్పోజింగ్ ద్వారా ట్రిక్ ఫొటోగ్రఫి సాధించి ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన ఘనత రాంబాబుది. (పూర్వం వున్న పద్దతులు కాకుండా కొత్త పద్ధతిలో తీయడం జరిగింది) దీనిని ఆ రోజులలో దూరదర్శన్ వారు కూడా ప్రచారం చేసారు. అన్ని పత్రికల ప్రశంసలు పొందారు.

ఆడియో కేసెట్ “సుముహూర్తం” పెళ్లి పాటలను 1996 లో ఆవిష్కరించిన ఘనత, దీనిని తెలుగువారు ప్రతి పెళ్లి కేసెట్ లోనూ వీడియోగ్రాఫర్స్ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఎందరో సినీ ప్రముఖుల, పెద్దల అనేక ప్రశంసలు పొందిన కేసెట్.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారిచే పురస్కారం, సేవా పురస్కార్ అవార్డు గ్రహీత (2014) దీనిని శ్రీ వెంకటేశ్వర కాలేజి ఆఫ్ ఆర్ట్స్, హైదరాబాద్  వారు బహూకరించారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్మ గారు సన్మానం చేసారు.

శ్రీ చక్కారాంబాబు గారి పరిచయం;

అందరికీ తెలిసిన రాంబాబు గారిని పరిచయం చేయడం ఏమిటనుకుంటున్నారా? ఒక గొప్ప ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఫొటో & వీడియో ఎడిటర్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నేత ఇంకా…మండపేట లయన్స్ క్లబ్ అధ్యక్షుడు. ఇంతేనా రాంబాబు గారంటే. ఇందుకేనా ఇప్పడు మనం ఆయనను గౌరవించుకుంటోంది?   కాదు…కాదు… కేవలం ఇందుకు కాదు. ఈ స్థానానికి రావడానికి ఆయన చేసిన కృషి మనకు స్పూర్తి కావాలనే ఆయన గురించి తెలియని యంగ్ జనరేషన్ కు ఆయన కృషిని, ఆలోచనా విధానాన్నితెలియజేసేందుకే ఈ పరిచయం. నాలుగు తరాల ఫొటోగ్రఫీ వారసత్వంతో ఆయన ఈ ఉన్నతస్థితికి చేరుకోలేదు. మీకు తెలుసే వుంటుంది ఆయన ముత్తాతగారు తూర్పుగోదావరి జిల్లాలోనే మొట్టమొదటిగా 1885లో కాకినాడలో ఫొటోస్టూడియో స్థాపించారు. ఆయన తరువాత ఆయన కుమారుడు శ్రీరామమూర్తి, ఆయన కుమారుడు కేశవరావుగారు కూడా ఫొటోగ్రఫీలోనే కొనసాగారు. 1962లో కేశవరావుగారు మండపేటలో రామాస్టూడియో నెలకొల్పారు. 2002 లో రాంబాబు గారు దానిని శ్రీరామ్స్ స్టూడియోగా మార్చారు. నాటి ఫొటోగ్రాఫర్లు కంపల్సరిగా ఆర్టిస్టులయివుండేవారు. వాళ్ళని ఫొటో ఆర్టిస్టులని కూడా పిలిచేవారు. ఆ గొప్పసాంప్రదాయానికి వారసుడిగా రాంబాబుగారు కూడా సహజంగా మంచి చిత్రకారుడయ్యారు. ఆయన డ్రాయింగ్ లో డిప్లమా కూడా చేసారు.

కేశవరావుగారు  ఫొటోస్టూడియోను ఆయనకు  బంగారుపళ్ళెంలో పెట్టి ఇవ్వలేదు. గొప్పవైభవంతో అనేకమంది సిబ్బందితో వెలిగిన ఆయన స్టూడియో ఆయన అతి మంచితనంతో నష్టాలపాలై అతిసామాన్యంగా మిగిలి రాంబాబుగారి చేతికొచ్చింది. ఏదో అద్భుతం చేసి తనను తాను

నిరూపించుకోవాలనే తపనతో రాంబాబు గారు జీవనపోరాటాన్ని ప్రారంభించారు. ఆర్టిస్టులకు సహజంగా వుండే పరిశీలన, కొత్తవిషయాలపై ఆసక్తి, ఏదేదో తెలుసుకోవాలనే తపన, ఏదో సాధించాలనే పట్టుదల ఆయనలో తీవ్రమై అన్ని విషయాలలోనూ వేలుపెట్టారు. అనేక పెయింటింగ్స్ చేసారు. చిత్రకళాపోటీలలో పాల్గొన్నారు. సినిమాస్లెడ్స్ చేసారు. పోర్టయిట్ పెయింటింగ్స్ చేసారు. ఎనామిల్ బోర్డులు రాసారు. హిప్నాటిజం  మేజిక్, నేర్చుకున్నారు. హిప్నాటిజం షోలు నిర్వహించారు. సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు. వీడియోగ్రాఫర్స్ అవసరాలకోసం ప్రత్యేకంగా ‘సుముహూర్తం’ అనే పెళ్ళిపాటల ఆడియో క్యాసెట్ సినీ ప్రముఖుల కాంబినేషన్ తో రిలీజ్ చేసారు. ఎన్నెన్నోకొత్త కొత్త బిజినెస్ లు చేసారు. అనేక సార్లు చేతులు కాల్చుకున్నారు. చివరికి ఫొటోగ్రఫీయే తన లక్ష్యమని, ధ్యేయమని నిర్ధారించుకున్నారు. దానిపైనే తన సర్వశక్తులూ కేంద్రీకరించి శ్రమించారు. ఆయన చేసిన “మల్టీ ఎక్స్పోజర్స్ ఆన్ సింగల్ ఫిల్మ్ టెక్నిక్” తో రాష్ట్ర వ్యాప్తంగా ఫొటోగ్రాఫర్స్, పత్రికల దృష్టిని ఆకర్షించారు. దూరదర్శన్ లో కూడా ఆయన ఇంటర్వ్యూ ప్రసారమై అఖండమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. పత్రికలలో ఆయన ఆర్టికల్ చూసి  ఎంతెంతో దూరాల నుండి ఆసక్తి పరులు వచ్చి ఆయనతో ఫొటోలు తీయించుకోవడం ఆయనకు ఓ మధురానుభవం. తరువాత ఈ టెక్నిక్ “ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్” లో కూడా చోటుచేసుకుంది.

ఫోటోగ్రఫీ రంగంలో 120 సంవత్సరాలు – చక్కా వారి వంశం

ఫోటోగ్రఫీ విఖ్యాతి గాంచిన చక్కా వారి వంశం: అనేక సంవత్సరాల క్రితం ఏదో సరదాగా, హాబీగా ప్రారంభించిన వృత్తి ఈనాడు నాలుగు తరాలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగుతున్నదంటే ఇది సామాన్య విషయం కాదు. కీ | | శే|| చక్కా బసవరాజు గారు ఫొటోగ్రఫీపై ఉన్నమక్కువతో రంగూన్ నుండి (ఒకనాటి బర్మా ఇప్పటి మయన్మార్) తెచ్చుకున్న కెమెరాతో ప్రారంభమై, బసవరాజుగారు 1885లో చక్కాబసవరాజు & సన్స్ అనే స్టూడియోని స్థాపించడంలో ఈ వృత్తికి ఈ వంశం వారికి పునాది అయ్యింది.

రెండవ తరం:

బసవరాజు గారి అడుగుజాడలలోనే వారి  కుమారుడు కీ||శే|| శ్రీరామమూర్తి గారు కూడా ఈ వృత్తినే కొనసాగించారు. 1903 లో కాకినాడలో శ్రీరామ్స్ స్టూడియోని ఈయన నెలకొల్పారు. ఆయన సమయంలో అనేక మరిచిపోలేని దృశ్యాలను కెమెరాలో బంధించడం జరిగింది. మహాత్మాగాంధీ గారి కాకినాడ పర్యటనలో తీసిన ఫొటోలు, రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ వారు కాకినాడ పరిసరాలలో బాంబులు వేసినపుడు తీసిన ఫొటోలు, అల్లూరి సీతారామరాజు గారిని మన్యంలో బ్రిటీష్ వారు అంతమొందించినప్పుడు తీసిన దృశ్యాలు. ఇవన్నీ ఈయనే తీసారంటే అప్పట్లో ఆయన పేరు ప్రఖ్యాతలు ఎలాంటివో ఊహించుకొనవచ్చును. అనేక ప్రత్యేక సందర్భాలలో బ్రిటీషు వారు ఈయన సేవలను ఉపయోగించుకున్నారంటే, కాకినాడ పరిసరాలలో శ్రీరామమూర్తి గారు ఫొటోగ్రఫీ రంగంలో ఎంత ఖ్యాతి గడించారన్నది అర్థం అవుతుంది.

మూడవ తరం:

చక్కావారి వంశంలోని వారి రక్తంలో ఈ వృత్తి ప్రవహిస్తుందనడానికి నిదర్శనం ఏమిటంటే మూడవతరానికి చెందిన వారు, శ్రీరామమూర్తి గారు పుత్రులు కూడా ఇదే వృత్తిని ఎంచుకొని వారు కూడా తమ వంతు సేవలని అందించారు. ప్రధమ పుత్రుడైన కీ||శే|| బసవరాజు గారు వారి తండ్రి గారిచే స్థాపించబడిన శ్రీరామ్స్ స్టూడియోని కొనసాగించారు. ద్వితీయ పుత్రుడు కీ | శే|| సత్యనారాయణ గారు భీమవరంలో 1959లో “రామా స్టూడియో”ని స్థాపించడం జరిగింది. తృతీయ పుత్రుడు అయిన శే॥॥ కేశవరావు గారు 1962లో మండపేటలో స్టూడియోని నెలకొల్పారు. ఈయన మండపేట పరిసర ప్రాంతాలలో మంచి ఖ్యాతిని సంపాదించడంతో పాటు అనేక మందిని కూడా ఈ రంగంలోకి ప్రోత్సహించారు. దీనిని బట్టి వీరి నిస్వార్ధ సేవను మనం గ్రహించవచ్చు.

నాలుగవ తరం:

పైన చెప్పిన పరంపరను కేశవరావు గారి కుమారుడు శ్రీ చక్కా వెంకట ఎల్లా శ్రీరామమూర్తి (చక్కా రాంబాబు) కొనసాగించారు. రాంబాబు గారు ఫొటోగ్రఫీకి సంబంధించిన అన్ని విభాగాలలో తమ నైపుణ్యతను ప్రదర్శించి పేరు ప్రఖ్యాతలు పొందారు. అదేవిధంగా వీడియోగ్రఫీ రంగంలో కూడా తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈయన మరో ప్రత్యేకత  ఏమిటంటే తమ వృత్తితో పాటు అనేక సేవారంగాలలో కూడా విశేషమైన కృషిచేసారు. ఇంకా అదే కృషిని కొనసాగిస్తున్నారు. ఈయన వృత్తిపరంగా, సేవారంగంలో సాధించిన విశేషాలు: సేవాపరంగా…

* లయన్ చక్కా రాంబాబు గారు 2012-2013 లయన్స్ క్లబ్ మండపేట ప్రెసిడెంట్గా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేపట్టి క్లబ్ అవార్డ్స్ సంపాదించుకున్నారు.

* ఇందులో భాగంగా 2012-2013కి గాను ఇంటర్నేషనల్ గవర్నర్స్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్ * ఏజెంట్ మీట్ కాన్ఫరెన్సులో అనేక రకాలైన అవార్డ్స్

* ఇయర్ రౌండ్ గ్రోత్ అవార్డ్

* ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఎలెక్స్ విన్సెంట్ గోయ్స్, యు.ఎస్.ఎ. వారిచేతుల మీదుగా ఇంటర్నేషనల్ మల్టిపుల్ అవార్డ్

* పర్మనెంట్ మెంబర్ షిప్ ఎచీవర్ అవార్డ్ * ఇంటర్నేషనల్ మల్టిపుల్ అవార్డ్

* పర్మనెంట్ ప్రాజెక్ట్ నిమిత్తం 2013-2014 బెస్ట్ జడ్.సి. ఎక్సలెన్సీ అవార్డ్ పొందారు.

* 2014–2015 లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా సేవల్ని అందిస్తున్నారు.

*మండపేట లయన్స్ క్లబ్ ద్వారా వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మండపేట లయన్స్ క్లబ్ గౌరవాన్ని పెంచారు.

* “స్పందన” అనే సంస్థకు అధ్యక్షులు సాంస్కృతిక సేవాసంస్థ కళారంగాలలో ప్రోత్సాహం అందచేయడం

* ది వైశ్య యూత్ మండపేట అధ్యక్షునిగా సేవల్ని అందిస్తున్నారు.

భావితరాలకు చక్కని చుక్కాని చక్కా రాంబాబు గారు జీవితంలో అరుదైన సంఘటనలను జీవితాంతం జ్ఞాపకం ఉంచుకోవటం ఎంత ఘనులకయినా అసాధ్యమే. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కనురెప్పకాలంలో కనుమరుగయ్యే సంఘటనలను సైతం తమ ఛాయాచిత్ర పరికరము (కెమెరా) లలో బంధించి మనకు అందించిన ఘనత చక్కా వంశం వారికి మాత్రమే స్వంతం అనడంలో అతిశయోక్తి లేదు. జాతిపిత గాంధీజీ సమకాలీకులయిన చక్కా బసవరాజు గారి రంగూన్ కెమెరాతో ప్రారంభమైన వారి ప్రస్థానం, రెండవ తరంలో రెండవ  ప్రపంచయుద్ధ సంఘటనలను, అల్లూరి మన్యం విశేషాలను తనలో కలుపుకొని, మూడవతరంలో శాఖోపశాఖలుగా విస్తరించి, ఖ్యాతిని గడించి, మరికొందరిని తమతో కలుపుకుని ముందుకు సాగిన పయనం వీరి నిస్వార్ధ సేవలకు నిదర్శనం. ఇంతటి ఘనకీర్తి పొందిన వంశ వారసులవడం గర్వకారణమే అయినా దానిని నిలబెట్టుకోవడంలో గత తరాలకు మించి సాధన చేసి, ముళ్ళబాటలను సరిచేసి, ముందు తరాల వారికి పూలబాటలు పరచిన చక్కని చుక్కాని మన చక్కారాంబాబు గారు. తాతల నాటి ఫొటోగ్రఫీకి మెరుగులు దిద్ది, తండ్రి తరం నాటి వీడియోగ్రఫీకి వన్నెలు అద్దిన వైనం వారి అనితరకృషికి నిదర్శనం.

వృత్తిపరంగానే కాక, వ్యక్తిపరంగా, సేవాపరంగా కూడా తమదైన ముద్రను స్వంతం చేసుకున్నారు. రత్నకేశవుల సంతానమై, రంగవల్లీ సమేతుడైన రాంబాబుగారు “స్పందన” సంస్థకు అధ్యక్షులయి, సాంస్కృతిక కళారంగాలవారికి ప్రోత్సాహాన్ని అందించడమే కాక, విద్యాభివృద్ధికి సైతం నడుంబిగించిన వీరు హైస్కూల్ ను వేదికగా ఎంచుకున్నారు. ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్లు రాంబాబు గారు లయన్స్ క్లబ్ ద్వారా కూడా తమ సేవలను విస్తృతపరిచారు. అధ్యక్షునిగా, జోన్ చైర్మన్గా, డిస్టిక్ట్ చైర్మన్, ది వైశ్యా యూత్ ప్రెసిడెంట్గా వివిధ పదవులు ఆయనను వరించడంలో ఆ వాసవీ మాత ఆశీస్సులు ఆయనకు తోడుగా ఉన్నాయన్న విషయం మనకు అవగతమవుతుంది.

వివిధ రంగాలలో వారు చేసిన విశేష కృషికి గాను అనేకానేక అవార్డులు, రివార్డులు ఆయనకు మోకరిల్లాయి. వాటిలో మచ్చుతునకలు కొన్ని మీ ముందు ఉంచుతున్నాము.

Year Round Growth 2012-13,

Best President Award,

Club President Excellency Award 2012-13,

International President Membership Award,

Lions Clubs International Multiple District 316 Award మొదలైనవి.

International Directior Ln. Winsent Goums  USA తమ స్వహస్తాలతో అందించిన అనేకానేక అవార్డులు, ప్రశంసాపత్రాలు వీరి విద్వత్తుకు నిలువెత్తు నిదర్శనాలు. అదే ఉత్సాహంతో కొనసాగుతున్న ఆయనకు

Telugu Book of Records, Wonder Books of Records వారు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు మరియు అనేక మంది రాష్ట్ర మంత్రులు  సహితం సత్కరించి తమ విజ్ఞతను ప్రదర్శించారు.

ఇద్దరు నది వద్ద నిలుచున్నారు. “ఇది నది” అన్నాడు ఒకడు.

“ఏది నది?….నువ్వు చెప్పినప్పుడు కనిపించిన నీరా?….. రెప్పపాటులో వెళ్ళిపోయినదా?…..ఇప్పడు వస్తున్నదా?…..మరోక్షణం తరువాత రాబోయే నీరా?….ఏది నది?” అన్నాడు ఆ రెండోవాడు. ఔను….ఏదీ…ఏ ఒక్కటీ కాదు. నిన్న… నేడు….. రేపు కలిసే ప్రవాహమే నది.

రాంబాబు ఫొటోలు, ఆల్టమ్లు, వీడియోలు, మిక్సింగ్లు అన్నీ నదిలాంటివే. ఇది….ఇది అనేసరికి ఆ ఇది అదైపోతుంది. మరొక అది వస్తుంది. రాంబాబును అనుకరించాలని ప్రయత్నించేవారికి నిత్యం మారిపోతూ వుండే రాంబాబుగారి శైలి దొరకదు. ఇది….అని వారు ఆ బాటలోకి వెళ్ళేసరికి ఆయన మరో హైవేలో ప్రయాణిస్తుంటారు.”థింక్ బిగ్” ఇదీ రాంబాబుగారి సక్సెస్ సూత్ర, ఆయన ఎన్నుకొనే లక్ష్యాలన్నీ ఉన్నతమైనవే. తన చుట్టూ గిరిగీసుకుని తన పరిధిని నిర్ణయించుకునే మనస్తత్వం కాదాయనది. ఈ ప్రాజెక్ట్ లో తనకెంత వస్తుంది? అని లాభనష్టాలు బెరీజు వేసుకునే శైలీ కాదాయనది. కొత్తదనం కోసం ఆయన ఎంతదూరమైనా వెళ్తారు. ఎంత ప్రయాస ఐనా పడతారు. ఎంత ఖర్చయినా చేస్తారు. “నేనొక గడ్డిపరకగా పుట్టవలసివస్తే… పర్వత శిఖరంపై మొలుస్తా” అనే మనస్తత్వం ఆయనది. అందుకే ఆయన తొలినాటి నుండి ఫొటోగ్రాఫర్ల నేతగా వివిధ పదవులలో కొనసాగుతూ వస్తున్నారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow